మానవ శరీరంలో కాలేయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. రక్తంలోని ప్రోటీన్లు, హార్మోన్ల సమతుల్యత, రక్త ప్రసరణను క్రమబద్ధీకరించడంలో లివర్ కీలకపాత్ర పోషిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేయడం దగ్గర నుంచి టాక్సిన్లు తొలగించడం వరకు 500కు పైగా విధులను నిర్వర్తిస్తుంది. అయితే, ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్, జంక్ ఫుడ్ తినడం, మద్యం ఎక్కువగా తాగడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కాలేయ సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. కాలేయానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన, ఆందోళన కలిగించే అంశం ఏంటంటే.. ఇది ప్రారంభ దశల్లో శరీరం వెంటనే ఎటువంటి లక్షణాలను చూపించకపోవచ్చు.
అయితే లివర్ దెబ్బతినడం మొదలైనప్పుడు ఆ ప్రభావం మన చర్మం, గోళ్లు, చేతులపై స్పష్టమైన మార్పుల రూపంలో కనిపిస్తుంది. చాలామంది వీటిని సాధారణ అలర్జీ లేదా అలసట అనుకుని నిర్లక్ష్యం చేస్తారు. ఈ హెచ్చరికలను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే లివర్‌ను తీవ్రమైన నష్టం నుంచి కాపాడుకోవచ్చు. లివర్ సమస్యలను సూచించే చేతుల లక్షణాలేంటో డాక్టర్ రమాకాంత్ రెడ్డి ఎ (కన్సల్టెంట్ – మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, గ్లెనీగల్స్ అవేర్ హాస్పిటల్, ఎల్.బి. నగర్, హైదరాబాద్) తెలిపారు.


