Asian Games 2026: భారత్‌కు రెండో గోల్డ్.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో అదరగొట్టిన సురుచి- కమల్‌జీత్
శ్రీకాకుళం వరదల్లో టెన్షన్.. ప్రవాహంలో కొట్టుకుపోయిన ఎమ్మెల్యే, అధికారులు
నా చావు కోసం పూజలు చేస్తున్నారు.. పేర్లు బయటపెడతా: జనసేన ఎమ్మెల్యే
*ప్రవాహాలతో రిజర్వాయర్లు, చెరువులు నింపాలి……. రాష్ట్రంలో వర్షాలు, నీటి ప్రవాహాలపై ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు*
*చెరువులు నింపేందుకు మొబైల్ లిఫ్ట్ లు*
*పడుతున్న వర్షాలతో భూగర్భజలాల రీఛార్జ్*
*రాష్ట్రంలో వర్షాలు, నీటి ప్రవాహాలపై ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు*
వర్షాల కారణంగా వస్తున్న ప్రవాహాలతో రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్ని నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కృష్ణా, గోదావరి డెల్టాలోని రిజర్వాయర్లతో పాటు పరిధిలో ఉన్న వివిధ నీటి వనరుల్ని కూడా నింపాలని స్పష్టం చేశారు. రియల్‌టైమ్ గవర్నెన్స్ కేంద్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగం, డేటా అనలిటిక్స్, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే వ్యూహాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్ష ప్రభావంపై సీఎం చర్చించారు. తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్రంలో గడచిన మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భూగర్భజలాలు కొంత మేర పెరిగాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రకాశం బ్యారేజి సహా మున్నేరు సహా ఇతర క్యాచ్ మెంట్ ఏరియా నుంచి 11 వేల క్యూసెక్కుల నీరు వస్తోందని అన్నారు. ప్రాజెక్టుల దిగువన ఉన్న అన్ని నీటి వనరుల్లో వర్షపు నీటిని నిల్వ చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. అవసరమైన చోట మోటార్లను వాడి నీటిని లిఫ్ట్ చేయాలని స్పష్టం చేశారు. గోదావరి నుంచి వస్తున్న ప్రవాహాల ద్వారా 24 టీఎంసీల నీటిని ఏలేరు రిజర్వాయర్ నింపాలని స్పష్టం చేశారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకూ నీటి వనరుల్లోకి నీటిని పంపాలన్నారు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వర్షాలు అధికంగా నమోదు అయ్యాయని అధికారులు వివరించారు. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ సహా వివిధ జిల్లాల్లో తీవ్ర వర్ష ప్రభావం కనిపించిందని తెలిపారు.
*గోదావరి, కృష్ణా, నాగావళి, వంశధార బేసిన్లపై ప్రత్యేక దృష్టి*
ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాలు, గాలుల తీవ్రత, నదులు–వాగుల్లో పెరుగుతున్న ప్రవాహాలు, రిజర్వాయర్లలోకి చేరుతున్న వరద నీరు, రాబోయే రోజుల్లో అంచనా వేసిన వర్షపాతంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. తాజా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టేలా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల ప్రభావంతో గోదావరి బేసిన్‌లోని శబరి, ఇంద్రావతి, ఏలేరు, తాండవ, ఎర్రకాల్వ, పంపా, మేఘాద్రిగడ్డ తదితర రిజర్వాయర్లకు భారీగా వరద నీరు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఏలేరు రిజర్వాయర్‌కు 21,200–26,500 క్యూసెక్కుల మేర, తాండవకు 6,000–7,500 క్యూసెక్కులు, మేఘాద్రిగడ్డకు 2,400–3,000 క్యూసెక్కులు, పంపాకు 3,100–3,875 క్యూసెక్కులు వరకు ఇన్‌ఫ్లో వస్తుందని అంచనా వేస్తున్నారు. ఉత్తర కోస్తా రిజర్వాయర్లకు కూడా రాబోయే రోజుల్లో ఇన్‌ఫ్లో గణనీయంగా పెరుగుతుందని వెల్లడించారు. నాగావళి–వంశధార బేసిన్లలో వర్షాల ప్రభావంతో ప్రవాహాలు పెరగనున్నాయని వివరిచారు. గొట్టా బ్యారేజీకి సెప్టెంబర్ 25 ఉదయం నాటికి వార్నింగ్ లెవల్–1 చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. భద్రాచలం వద్ద సెప్టెంబర్ 26 మధ్యాహ్నానికి వార్నింగ్ లెవల్–1, అదే రోజు రాత్రికి వార్నింగ్ లెవల్–2 దాటే అవకాశం ఉందని తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సెప్టెంబర్ 27 ఉదయం వార్నింగ్ లెవల్–1, సాయంత్రం వార్నింగ్ లెవల్–2 దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. శబరి నదిపై కుంటా వద్ద సెప్టెంబర్ 26 ఉదయానికి వార్నింగ్ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
*ప్రకృతి వ్యవసాయం చేయాలి… భూసారాన్ని పెంచాలి*
ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితులను మార్చడం సాధ్యం కాకపోయినా.. వాటి ప్రభావాన్ని తగ్గించేలా అంతర్గత పరిస్థితులను మార్చుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. భూసారాన్ని పెంచడం, సాయిల్ టెస్టింగ్ ఆధారంగా ప్రత్యామ్నాయ పంటలను సూచించడం, బయోచార్, ప్రకృతి వ్యవసాయం వంటి విధానాల ద్వారా ఎల్‌నినో ప్రభావాన్ని కొంతమేర తగ్గించవచ్చని తెలిపారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో పైలట్‌గా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి వ్యవసాయ రంగానికి అవసరమైన సూచనలు అందించేలా సాంకేతికతను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. వ్యవసాయానికి సంబంధించిన సమాచారంతో పాటు సాగునీటి లభ్యత, రిజర్వాయర్ల పరిస్థితి తదితర వివరాల డేటా పొందుపరచాలని ఆదేశించారు. అక్టోబరు 2 తేదీన ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కు శంకుస్థాపన చేయనున్నామని, అదే రోజు రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామన్నారు. మైక్రోసాఫ్ట్ సహకారంతో రూపొందించిన ఏఐ స్టాక్ ద్వారా కలిగే లాభాలను వివరిస్తూ డెమో ఇవ్వాలని సీఎం సూచించారు. భూగర్భజలాలు సహా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలపైనా అమెరికాలోని పృథ్వీ అనే యువకుడు రూపోందించిన యాప్ లను సీఎం పరిశీలించారు. వివిధ శాఖల నుంచి సేకరించిన డేటా సెట్లను సమన్వయం చేసుకుంటూ నాసా ఉపగ్రహ చిత్రాలను అనుసంధానం చేస్తూ ఈ యాప్ ను రూపొందించిన పృథ్విని సీఎం అభినందించారు. భూగర్భజలాల స్థాయిలు, వాటి మార్పులు, ప్రాంతాల వారీ పరిస్థితులను విశ్లేషించడం ద్వారా భవిష్యత్తులో నీటి నిర్వహణకు మెరుగైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.
*శాప్ ద్వారా క్రీడా క్యాలండర్*
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపరచాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ టారిఫ్‌ను పెంచకపోయినా సేవల్లో లోపాల కారణంగా ప్రజల్లో సంతృప్తి తగ్గుతోందని, సరఫరా నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో 287.214 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉన్న నేపథ్యంలో.. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీటి లభ్యతపైనా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఇసుక లభ్యత ధరలు, సరఫరాపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. శాప్ ఆధ్వర్యంలో ఏడాది క్రీడా క్యాలెండర్‌ను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామస్థాయిలోనూ క్రీడా పోటీలు నిర్వహించాలని సూచించారు. 175 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరును మెరుగుపరిచేలా స్పష్టమైన సూచనలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. నోడల్ అధికారుల ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి పనితీరులో మార్పు తీసుకురావాలని ఆదేశించారు. గృహనిర్మాణంలో జీరామ్‌జీ ద్వారా మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టాలని సీఎం సూచించారు. డేటా ఆధారిత పాలనలో భాగంగా ప్రభుత్వ శాఖల్లో ఏఐ లివింగ్ ల్యాబ్స్ యాప్‌ల వినియోగం, సమాచార విశ్లేషణను మరింత విస్తరించాలని సీఎం స్పష్టం చేశారు.
అంబటికి మరోసారి ఈడీ నోటీసులు.. ఈ నెల 28న విచారణకు వెళ్తారా? లేదా?
2033 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
రాష్ట్ర అభివృద్ధి కార్యాచరణకు వేగం పెంచే దిశగా కీలక నిర్ణయాలు
TSDPS బలోపేతం.. ప్రత్యేక PMU ఏర్పాటు
జిల్లా అభివృద్ధి ప్రణాళికలు, ఏడు సెక్టోరల్ గ్రోత్ ల్యాబ్స్‌కు రూపకల్పన
ప్రభుత్వం–GFST భాగస్వామ్యానికి ప్రతిపాదన
తెలంగాణను 2030 నాటికి పేదరిక రహిత రాష్ట్రంగా, 2033 నాటికి దేశంలోనే తొలి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యాచరణకు మరింత వేగం పెంచనుంది. రాష్ట్ర దీర్ఘకాలిక ఆర్థిక, సామాజిక అభివృద్ధి లక్ష్యాలను వేగంగా సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన గురువారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఆర్థిక, ప్రణాళిక శాఖల కార్యదర్శులతో పాటు పలువురు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్‌కు చెందిన GFST వైస్ చైర్మన్ ఎస్.పీ. టక్కర్‌తో పాటు GFST ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక, అమలు వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం, శాఖల మధ్య సమన్వయాన్ని పెంచడం, అభివృద్ధి ఫలితాలను నిరంతరం పర్యవేక్షించేలా వ్యవస్థలను రూపొందించడంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
TSDPSకు ప్రత్యేక PMU
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం (TSDPS)ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రత్యేక ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ (PMU) ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రాధాన్యతా అభివృద్ధి కార్యక్రమాలకు వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించడం, వివిధ శాఖల మధ్య సమన్వయం, కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ, పురోగతిని వేగవంతం చేయడం వంటి బాధ్యతలను PMU నిర్వహించనుంది.
2030 నాటికి ‘జీరో పావర్టీ’
2030 నాటికి తెలంగాణను ‘జీరో పావర్టీ’ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక, లక్ష్యిత కార్యక్రమాలను అమలు చేయనున్నారు. పేదరికానికి గురయ్యే కుటుంబాలను గుర్తించి, వారికి అందాల్సిన వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సమన్వయంతో అమలు చేయడంతో పాటు స్థిరమైన జీవనోపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నారు. పేదరిక నిర్మూలన కార్యక్రమాల ఫలితాలను కొలిచేందుకు, పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
2033 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ
తెలంగాణను 2033 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వేగవంతమైన, కేంద్రీకృత అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించనున్నారు. రాష్ట్రంలోని బలాలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు, సమ్మిళిత అభివృద్ధికి కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేలా కార్యాచరణ రూపొందించనున్నారు.
రంగాల వారీ నిపుణుల సేవలు
రాష్ట్ర ప్రభుత్వ సంస్థాగత సామర్థ్యాన్ని పెంచేందుకు వివిధ రంగాల్లో ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన నిపుణులు, కన్సల్టెంట్ల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు అవసరమైన సాంకేతిక, వ్యూహాత్మక సహకారాన్ని నిపుణుల ద్వారా పొందనున్నారు.
ప్రభుత్వం–GFST భాగస్వామ్యం
వ్యూహాత్మక ప్రణాళిక, డేటా ఆధారిత నిర్ణయాలు, సాంకేతిక పరిజ్ఞానం, నాలెడ్జ్ సపోర్ట్, సామర్థ్య నిర్మాణం, పర్యవేక్షణ, కీలక అభివృద్ధి కార్యక్రమాల వేగవంతమైన అమలుకు తెలంగాణ ప్రభుత్వం–GFST మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకునే ప్రతిపాదనను సిద్ధం చేయాలని నిర్ణయించారు.
జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు
రాష్ట్ర స్థాయి అభివృద్ధి లక్ష్యాలను జిల్లాల స్థాయిలో కొలిచే వీలున్న ఫలితాలుగా మార్చేందుకు సమగ్ర జిల్లా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. ఈ ప్రణాళికలకు డేటా ఆధారిత డ్యాష్‌బోర్డులు, స్పష్టమైన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPIs), కొలిచే వీలున్న ఫలితాలు, బడ్జెట్ అనుసంధానం ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.
దీంతో జిల్లాల అభివృద్ధి పురోగతిని నిరంతరం పర్యవేక్షించడంతో పాటు లోటుపాట్లను గుర్తించి, అవసరమైన చోట సకాలంలో దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.
ఏడు సెక్టోరల్ గ్రోత్ ల్యాబ్స్
ప్రభుత్వ శాఖలు, రంగాల నిపుణులు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, అభివృద్ధి సంస్థలు, ఇతర కీలక భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఏడు సెక్టోరల్ గ్రోత్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ఈ గ్రోత్ ల్యాబ్స్‌లో ప్రధానంగా పేదరిక నిర్మూలన, మౌలిక వసతులు–లాజిస్టిక్స్, ఆరోగ్యం, పర్యాటకం, పశుసంపద–ఆక్వాకల్చర్, పట్టణీకరణ, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ అంశాలపై దృష్టి సారించనున్నారు.
అభివృద్ధి అవకాశాలను గుర్తించడం, అమలులో ఉన్న అవరోధాలను పరిష్కరించడం, రంగాల వారీ వ్యూహాలను రూపొందించడం, ప్రాధాన్యతలను కాలపరిమితితో కూడిన, కొలిచే వీలున్న కార్యాచరణ ప్రణాళికలుగా మార్చడం గ్రోత్ ల్యాబ్స్ ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది.
ఫలితాల ఆధారంగా అభివృద్ధి
TSDPS–PMU బలోపేతం, జిల్లా అభివృద్ధి ప్రణాళికలు, ఏడు సెక్టోరల్ గ్రోత్ ల్యాబ్స్, రంగాల నిపుణుల సేవలు, ప్రభుత్వం–GFST భాగస్వామ్యం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి సమగ్ర సంస్థాగత వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. డేటా ఆధారిత నిర్ణయాలు, ఫలితాలపై దృష్టి, మిషన్ మోడ్‌లో అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఈ వ్యవస్థ దోహదపడనుంది.
2030 నాటికి పేదరిక నిర్మూలన, 2033 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ లక్ష్యాలను వేగంగా సాధించేందుకు రాష్ట్ర అభివృద్ధి దార్శనికతను కార్యాచరణలోకి తీసుకురావడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశమని సమావేశంలో స్పష్టం చేశారు.
సమావేశంలో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

