తెలంగాణలో ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తున్న తయారీ సంస్థలపై టీజీ సేఫ్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 20 యూనిట్లలో తనిఖీలు చేపట్టి పలు లోపాలను గుర్తించారు. అపరిశుభ్రత, కాలం చెల్లిన ముడిసరుకులు, పురుగుల సంచారం వంటి సమస్యలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో 9 సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేశారు. మరికొన్ని సంస్థలకు నోటీసులు అందించారు. సుమారు రూ.5.89 లక్షల విలువైన 5,555 కిలోల ఆహార పదార్థాలను సీజ్ చేశారు. 21 నమూనాలను పరీక్షలకు పంపించారు. ఆహార నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహించే సంస్థలపై చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.


