తట్టన్‌చావడి ఎన్నికల ఫలితం ఉదయం 11 గంటలలోపే వెల్లడైంది. అధికార ఆలియాండి ఎన్ రంగస్వామి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశోక్ ఆనంద్ 8482 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి వినాయగంపై గెలిచారు.
నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసి రానా రథ్ 1.6 లక్షల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. నందిగ్రామ్‌లో 80.89 శాతం పోలింగ్ కాగా.. రెజీనగర్‌లో 80.08 శాతం పోలింగ్ నమోదైంది.
ఆమ్ జనతా ఉన్నయాన్ పార్టీ (ఏజేయూపీ) చీఫ్ హుమాయున్ కబీర్ 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రెజీనగర్తోపాటు నౌడా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రెజీనగర్ స్థానాన్ని ఆయన వదులుకోవడంతో ఉపఎన్నిక జరిగింది. రెజీనగర్‌లోనూ బీజేపీ 75 వేలకుపైగా మెజార్టీతో గెలవడం విశేషం.
తమిళనాడులోని మధురాంతకం, ధారాపురం రెండూ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు. మధురాంతకం నియోజకర్గంలో 2.13 లక్షల ఓట్లు ఉండగా.. ఉపఎన్నికలో 27 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. తాజా మాజీ ఎమ్మెల్యే మరగనాథం కుమారవేల్ టీవీకే నుంచి పోటీ చేయగా.. డీఎంకే నుంచి పరాంతమన్, అన్నాడీఎంకే నుంచి కణిత సంపత్, ఎన్టీకే నుంచి జి.జానకీరామన్, సీపీఐ(ఎం) నుంచి పి.సుగంతి పోటీ చేశారు. మరగనాథం కుమారవేల్ అన్నాడీఎంకేకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీవీకేలో చేరడంతో ఈ ఉపఎన్నిక జరిగింది. ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మధురాంతకంలో 93.22 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఉపఎన్నికలో 86.26 శాతం పోలింగ్ నమోదైంది.


