తెలంగాణ యువకులను విదేశీ ఉద్యోగాల పేరుతో రష్యాకు తీసుకెళ్లి.. అక్కడి సైన్యంలో చేర్చారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వంటవాళ్లు, క్లీనర్లు, మెకానిక్‌లు, గార్డెనర్లు, ఇతర సహాయక సిబ్బంది ఉద్యోగాలు విదేశాల్లో ఇప్పిస్తామని నమ్మించి కొందరు ఏజెంట్లు.. యువకులను రష్యాకు పంపినట్లు బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేశాయి. అక్కడికి వెళ్లిన తర్వాత కొందరికి పౌర ఉద్యోగాలు ఇవ్వకుండా సైనిక శిక్షణకు పంపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తెలంగాణకు చెందిన 20 మంది ఈ రిక్రూట్మెంట్ నెట్వర్క్ బారిన పడి.. అక్కడికి వెళ్లినట్లు సమాచారం. వీరిలో కొందరు స్వదేశానికి తిరిగి రాగా.. మరికొందరు ఇంకా అక్కడే చిక్కుకుపోయారని బాధితులు చెబుతున్నారు. నలుగురు తెలంగాణ యువకులు రష్యా సైన్యం తరఫున ఉక్రెయిన్‌పై యుద్ధంలో పాల్గొన్నట్లు భావిస్తున్నారు.
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలనుకునే యువకులను లక్ష్యంగా చేసుకుని ఏజెంట్లు ఈ వ్యవహారాన్ని నడిపినట్లు బాధితుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. రష్యాలో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని.. వీసా, ప్రయాణ ఏర్పాట్లు చేస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. వంటవాళ్లు, శుభ్రత సిబ్బంది, తోటల నిర్వహణ, మెకానిక్‌లు, ఇతర సహాయక ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన పలువురు యువకుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. విదేశాల్లో ఉద్యోగం చేసి అప్పులు తీర్చుకోవాలనే ఆశతో వెళ్లినవారు అక్కడి పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు బాధిత కుటుంబాలు చెబుతున్నాయి.
కొంతమంది యువకులు తమ పరిస్థితిని వివరిస్తూ వీడియోలు, మెసేజ్‌ల ద్వారా సహాయం కోరుతున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. స్వదేశంలో చేసిన అప్పులను తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఏజెంట్లను నమ్మి అక్కడికి వెళ్లామని.. చివరకు మోసపోయి స్వదేశానికి తిరిగివచ్చిన కస్తూరి తిరుపతి అనే యువకుడు పేర్కొన్నాడు. ఉపాధి కోసం వెళ్లిన యువకులు విదేశీ సైనిక వ్యవస్థలో చిక్కుకోవడం వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. రష్యాలో చిక్కుకున్న తెలంగాణ యువకులను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. స్వదేశానికి రప్పించే చర్యల్లో గుర్తించిన 16 మందిలో బండ లింగాపూర్‌కు చెందిన శేఖర్, కేశాపూర్‌కు చెందిన రాజశేఖర్, ధర్పల్లికి చెందిన తిరుపతి స్వదేశానికి తిరిగివచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన 13 మంది స్వదేశానికి చేరుకునేందుకు ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు లేఖ రాశారు. రష్యాలో చిక్కుకున్న 16 మంది భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కొందరి విడుదల, తిరుగు ప్రయాణానికి సహకరించిన కేంద్ర విదేశాంగ శాఖకు.. భారత రాయబార కార్యాలయానికి ఎంపీ అర్వింద్ కృతజ్ఞతలు తెలిపారు.


