హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన కేబీఆర్ పార్క్ వద్ద చేపట్టిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే. కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ప్రతిపాదించిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల ప్రాజెక్టులో కీలక మార్పులు చేసింది. పాత డిజైన్లలోని పలు నిర్మాణాలను రద్దు చేస్తూ.. ప్రాజెక్టును సవరించిన రూపంలో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. గతంలో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కు జారీ చేసిన లెటర్ ఆఫ్ అవార్డును ఉపసంహరించుకుంది. అదే సమయంలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌కు పనులు అప్పగించేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ గతంలో ప్రతిపాదించిన అన్ని నిర్మాణాలను యథాతథంగా కొనసాగించకుండా.. ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా పనుల పరిధిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సవరించింది. పంజాగుట్ట శ్మశానవాటిక జంక్షన్లో ప్రతిపాదించిన 3 లేన్ల వన్‌వే ఫ్లైఓవర్, ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్లో ప్రతిపాదించిన 2 లేన్ల వన్‌వే ఫ్లైఓవర్ నిర్మాణాలను రద్దు చేసింది. బంజారాహిల్స్‌లో ప్రతిపాదించిన 2 లేన్ల వన్‌వే అండర్‌పాస్ పనులను కూడా తొలగించింది.
అలాగే కేబీఆర్ పార్క్ ప్రవేశ ద్వారం, ముగ్ధ జంక్షన్, రోడ్ నంబర్ 45, ఫిల్మ్‌నగర్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ ఆస్పత్రి జంక్షన్ పరిసరాల్లో చేపట్టాల్సిన పనుల పరిధిలోనూ మార్పులు చేసింది. పాత ప్రణాళికలోని కొన్ని గ్రేడ్ సెపరేటర్లను తొలగించి.. ప్రధాన ఎలివేటెడ్ మార్గంపై దృష్టి పెట్టనున్నారు. సవరించిన ప్రణాళికలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీ వరకు స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మార్గాన్ని బంజారాహిల్స్ రోడ్ నంబర్-1కు అనుసంధానించేలా కనెక్టింగ్ ర్యాంప్ ఏర్పాటు చేయనున్నారు.
నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు 6 లేన్ల స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టే ప్రతిపాదన ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని కొనసాగించడంతో పాటు.. అవసరమైన చోట్ల మాత్రమే కొత్త నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో 2 ప్యాకేజీలుగా అమలు చేయనున్నారు. మొదటి ప్యాకేజీలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ముగ్ధ జంక్షన్ వరకు.. రెండో ప్యాకేజీలో ముగ్ధ జంక్షన్ నుంచి ముఫకంజా కాలేజీ వరకు పనులు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేసింది.
ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ల సేవలను కొనసాగించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. సవరించిన ప్రతిపాదనలను ఈపీసీ కమిటీ-III ముందు ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. జీహెచ్ఎంసీ చేపట్టిన సంబంధిత చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు జీవో ఆర్టీ నంబర్ 927 జారీ చేశారు. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో అనేక ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, గ్రేడ్ సెపరేటర్లకు బదులుగా సమగ్ర ఎలివేటెడ్ మార్గాన్ని అభివృద్ధి చేయడం వల్ల ప్రైవేటు భూముల సేకరణ అవసరం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
భూసేకరణ వ్యయంలో సుమారు రూ.800 కోట్లు.. పాత ప్రణాళికలోని అదనపు నిర్మాణాలను తొలగించడం ద్వారా మరో రూ.400 కోట్లు ఆదా కావచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంచనాల ప్రకారం మొత్తం రూ.1,200 కోట్ల వరకు ఆదా సాధ్యమని చెబుతున్నారు. మొత్తంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం పాత ప్రణాళికను మార్చి.. స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోంది. సవరించిన డిజైన్లకు తుది అనుమతులు, పనుల ప్రారంభం, నిర్మాణ గడువు వంటి అంశాలపై తదుపరి అధికారిక ప్రకటనలు కీలకం కానున్నాయి.


