HomeHeadlinesLok Sabha Seats Increase: కేంద్రం కీలక నిర్ణయం..! లోక్‌సభ స్థానాలు 50 శాతం పెంపు.....

Lok Sabha Seats Increase: కేంద్రం కీలక నిర్ణయం..! లోక్‌సభ స్థానాలు 50 శాతం పెంపు.. 2051 వరకు డీలిమిటేషన్‌ ఫ్రీజ్!

Lok Sabha Seats Increase: కేంద్రం కీలక నిర్ణయం..! లోక్‌సభ స్థానాలు 50 శాతం పెంపు.. 2051 వరకు డీలిమిటేషన్‌ ఫ్రీజ్!

దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసే దిశగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్‌ మరో ముందడుగు వేసింది. డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించిన బిల్లులో కీలక సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది..

ఈ ప్రతిపాదనల ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్యను అన్ని రాష్ట్రాల్లో ఏకరీతిగా 50 శాతం పెంచనున్నారు. అలాగే రాష్ట్రాల మధ్య లోక్‌సభ స్థానాల నిష్పత్తిని నిర్ణయించేందుకు 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకునే గడువును మరో 25 ఏళ్లు పొడిగించనున్నట్లు తెలుస్తోంది. అంటే 2051 వరకు ఈ విధానాన్ని కొనసాగించే ప్రతిపాదన ఉంది. దక్షిణాది రాష్ట్రాలు చాలా కాలంగా చేస్తున్న ప్రధాన డిమాండ్లలో ఇది కూడా ఒకటి కావడంతో ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

850కు పెరగనున్న లోక్‌సభ స్థానాలు?


ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ నిబంధనల ప్రకారం లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్య 550గా ప్రతిపాదిత చట్రంలో పేర్కొనబడింది. తాజాగా ప్రతిపాదించిన రాజ్యాంగ 131వ సవరణ బిల్లు ద్వారా ఈ గరిష్ఠ పరిమితిని 850కి పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో రాష్ట్రాలకు గరిష్ఠంగా 815 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 స్థానాలు కేటాయించే ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం ఉన్న స్థానాల సంఖ్యతో పోలిస్తే అన్ని రాష్ట్రాల్లోనూ 50 శాతం పెంపు చేపట్టాలన్నది ప్రధాన ప్రతిపాదనగా ఉంది.

డీలిమిటేషన్ అంటే ఏమిటి?


డీలిమిటేషన్ అంటే లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను పునర్విభజించడం, జనాభా ప్రాతిపదికన స్థానాల కేటాయింపును నిర్ణయించడం. రాజ్యాంగంలోని 81, 82, 170 అధికరణలకు అనుగుణంగా స్వతంత్ర డీలిమిటేషన్ కమిషన్ ఈ ప్రక్రియను చేపడుతుంది. నియోజకవర్గాల్లో జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యం ఉండేలా చూడటంతో పాటు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేసిన స్థానాల కేటాయింపులోనూ మార్పులు చేయడం ఈ ప్రక్రియలో భాగం.

దక్షిణాది రాష్ట్రాల డిమాండ్లకు ప్రాధాన్యం


డీలిమిటేషన్ ప్రతిపాదనపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జనాభా నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్తులో లోక్‌సభ స్థానాల కేటాయింపులో నష్టం జరుగుతుందనే భయాలు ఉన్నాయి. జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు అధిక స్థానాలు కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల మధ్య స్థానాల నిష్పత్తిని కొనసాగిస్తూ, అన్ని రాష్ట్రాల్లో 50 శాతం స్థానాల పెంపు చేపట్టాలనే ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు మహిళా రిజర్వేషన్ అమలుతో కూడా డీలిమిటేషన్ ప్రక్రియ ముడిపడి ఉంది. మహిళలకు పార్లమెంట్‌లో రిజర్వేషన్లు కల్పించే అంశంతో పాటు జనాభా ఆధారిత ప్రాతినిధ్యం, జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాల ప్రయోజనాలను సమతుల్యం చేయడం కేంద్రానికి కీలకంగా మారింది.

నవంబర్ 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు


ఈ నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కూడా ఆసక్తి నెలకొంది. 18వ లోక్‌సభ ఎనిమిదో సమావేశం రెండో విడత నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు నిర్వహించనున్నట్లు లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. ప్రభుత్వ కార్యకలాపాలను బట్టి సమావేశాల వ్యవధిలో మార్పులు ఉండవచ్చని తెలిపింది. లోక్‌సభను నవంబర్ 30న, రాజ్యసభను డిసెంబర్ 2న తిరిగి సమావేశపరచాలని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌లను కోరినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గురువారం రోజు వెల్లడించారు. ఈ స్వల్పకాలిక సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఏ బిల్లులను సభలో ప్రవేశపెడతారనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. చివరిసారిగా 2026 ఆగస్టు 13న ముగిసిన వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. తాజా కేబినెట్ నిర్ణయాలు, రానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో డీలిమిటేషన్ అంశం దేశ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments