పత్రికల్లో వచ్చిన కథనాలపై సమగ్ర విచారణకు ఆదేశం – విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని స్పష్టం
విద్యార్థుల సమస్యలపై అలసత్వం వద్దు.. వాస్తవాలను తెలుసుకుని పరిష్కరిస్తాం – హరీష్‌బాబు
బత్తలపల్లి, సెప్టెంబర్ 05:– బత్తలపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పత్రికల్లో వచ్చిన కథనాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్, తక్షణమే స్పందించారు. విద్యార్థుల సమస్యలు, పాఠశాలలోని వసతులపై వచ్చిన కథనాల వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు తన నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్‌బాబును వెంటనే పాఠశాలకు వెళ్లి పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు శుక్రవారం హరీష్‌బాబు, బత్తలపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ఆకులేటి భాస్కర్‌తో కలిసి మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఆవరణలోని వసతులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పాఠశాల నిర్వహణకు సంబంధించిన పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడిన హరీష్‌బాబు, వారికి ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల నుంచి వారి రోజువారీ అవసరాలు, పాఠశాలలోని వసతులు, ఎదురవుతున్న ఇబ్బందులపై వివరాలు సేకరించారు. పత్రికల్లో ప్రచురితమైన కథనాల్లో పేర్కొన్న అంశాలకు సంబంధించి వాస్తవ పరిస్థితి ఏమిటన్నది కూడా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బందితో మాట్లాడిన హరీష్‌బాబు, పత్రికల్లో వచ్చిన కథనాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాఠశాల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని సూచించారు. అలాగే మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలల కన్వీనర్ శ్రీమతి జమునాబాయితో ఫోన్‌లో మాట్లాడిన హరీష్‌బాబు, పాఠశాలలోని పరిస్థితులపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని సూచించారు. పత్రికల్లో వచ్చిన ప్రతి అంశాన్ని పరిశీలించి, వాస్తవ పరిస్థితులను నిర్ధారించి, సమగ్ర విచారణ నివేదికను సిద్ధం చేసి అందించాలని ఆమెను కోరారు. ఇదే సమయంలో ప్రస్తుతం సెలవులో ఉన్న పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి మాధవితో కూడా హరీష్‌బాబు ఫోన్‌లో మాట్లాడారు. పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని, పాఠశాల నిర్వహణలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఇలాంటి కథనాలు గానీ, విద్యార్థులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు గానీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రిన్సిపాల్‌ను హెచ్చరించారు.


