రాత్రి నిద్రపోతున్న సమయంలో మూత్రవిసర్జన కోసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు మెలకువ రావడాన్ని వైద్యపరంగా ‘నాక్టూరియా’ (Nocturia) అంటారు. సాధారణంగా ఏదో కారణం వల్ల నిద్రలేచి “సరేలే కదా” అని బాత్రూమ్కు వెళ్లడానికి, నాక్టూరియాకు తేడా ఉంది. నాక్టూరియా ఉన్న వ్యక్తి మూత్రం ఆపుకోలేక మాత్రమే నిద్రలేస్తాడు, మూత్రవిసర్జన తర్వాత మళ్లీ పడుకుంటాడు. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు, కానీ వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
ఇది కేవలం బాత్రూమ్కు వెళ్లడం మాత్రమే కాదు. మాటిమాటికీ నిద్రలేవడం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది, పగటిపూట విపరీతమైన అలసట, పనిపై ఏకాగ్రత లేకపోవడం, జీవన ప్రమాణాలు తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. దీని వెనుక మూత్రాశయం (బ్లాడర్), మూత్రపిండాలు (కిడ్నీలు), హార్మోన్లు, నిద్రలేమి లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కారణమై ఉండవచ్చు. దీనిపై ఉన్న సందేహలతో పాటు పూర్తి సమాచారాన్ని డాక్టర్ శశాంక్ ఎమ్ ఎస్ (కన్సల్టెంట్ – యూరాలజీ & కిడ్నీ మార్పిడి విభాగం, ఆస్టర్ సిఎమ్ఐ హాస్పిటల్, బెంగళూరు) అందించారు.


