
న్యూఢిల్లీ:
దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖ, కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (CESL) సంస్థ ఒప్పందం చేసుకున్నాయి. న్యూఢిల్లీలో శనివారం జరిగిన ఈ ఒప్పందం ద్వారా పంచాయతీల ఖాళీ భూముల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.దీనివల్ల పంచాయతీలకు అదనపు ఆదాయం లభించడంతో పాటు పెట్రోల్, డీజిల్ పై ఆధారపడటం తగ్గుతుందని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దేశంలో 29,151 పబ్లిక్ ఈవీ చార్జింగ్ కేంద్రాలు ఉండగా, ఈ సదుపాయాన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు పేర్కొంది.


