
30 కేసుల్లో నిందితురాలు.. 13 కేసుల్లో పరారీలో ఉన్న కలపతి నీతూ బాయి అరెస్ట్
హైదరాబాద్‌లో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ కీలక చర్యలు చేపట్టింది. గత తొమ్మిదేళ్లుగా గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 51 ఏళ్ల కలపతి నీతూ బాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. నానక్‌రామ్‌గూడకు చెందిన ఆమెను నవంబర్ 6న మంగళ్‌హాట్ వైపు ఆటోలో ప్రయాణిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు.30 కేసుల్లో నిందితురాలు..
13 కేసుల్లో పరారీ:
పోలీసుల విచారణలో 2017 నుంచి 2026 వరకు ఆమెతో పాటు కుటుంబ సభ్యులపై వివిధ పోలీస్ స్టేషన్లు, ఎక్సైజ్ విభాగాల్లో సుమారు 30 NDPS, ఎక్సైజ్ కేసులు నమోదైనట్లు వెల్లడైంది. వీటిలో 13 కేసుల్లో ఆమె పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పలుమార్లు అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా గంజాయి వ్యాపారం కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.గంజాయి,
నగదు భారీగా స్వాధీనం:
2023 ఆగస్టులో ఆమె కుమారుడి నుంచి 22 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కుటుంబానికి సంబంధించిన ఆస్తుల్లో సుమారు రూ.40 లక్షల నగదు గుర్తించారు. 2023 అక్టోబర్‌లో గచ్చిబౌలి పోలీసులు 7.5 కిలోల గంజాయి, రూ.5 లక్షలు స్వాధీనం చేసుకోగా, 2024 మార్చిలో మరోసారి 22 కిలోల గంజాయి, రూ.22 లక్షల నగదును పట్టుకున్నారు.
కోట్ల విలువైన ఆస్తులపై పోలీసుల దృష్టి:
గంజాయి విక్రయాల ద్వారా అక్రమంగా ఆస్తులు సంపాదించినట్లు అనుమానిస్తున్న పోలీసులు.. లంగర్‌హౌస్‌లో రెండు జీ+3 భవనాలు, గచ్చిబౌలిలో ఒక జీ+2 భవనం, నానక్‌రామ్‌గూడలోని నివాస నిర్మాణాలపై విచారణ జరుపుతున్నారు. గతంలో నిందితురాలు, కుటుంబ సభ్యులు, కుటుంబానికి చెందిన జయలక్ష్మి కిరాణా అండ్ జనరల్ స్టోర్ బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపజేసినట్లు వెల్లడించారు.
ఫోన్ వాడకుండా పోలీసులకు చిక్కకుండా:
గత కొంతకాలంగా పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు నానక్‌రామ్‌గూడ, గచ్చిబౌలి, లంగర్‌హౌస్ ప్రాంతాల్లో తరచూ నివాసాలు మారుస్తూ, మొబైల్ ఫోన్ వినియోగాన్ని కూడా తగ్గించినట్లు పోలీసులు తెలిపారు. అయినప్పటికీ ఈగల్ ఫోర్స్ టెక్నికల్ టీమ్ ప్రత్యేక నిఘా, సమాచార సేకరణతో ఆమె ఆచూకీ గుర్తించి అరెస్ట్ చేసింది. ఆమె వద్ద నుంచి రూ.1,59,500 నగదు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.నిందితురాలిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ప్రస్తుతం గంజాయి సరఫరాదారులు, సహకరించిన వ్యక్తులు, ఆర్థిక లావాదేవీలు, ఆస్తులపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రజలకు ఈగల్ ఫోర్స్ విజ్ఞప్తి:
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈగల్ ఫోర్స్ సూచించింది. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ విక్రయాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరింది.
📞 టోల్ ఫ్రీ నంబర్: 1908
📱 వాట్సాప్: 87126 71111📢 మాదకద్రవ్య రహిత తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.
#Hyderabad #Ganja #EagleForce #Telangana #DrugFreeTelangana


