ఈ రోజుల్లో చాలా మంది ఇతరుల్ని మెప్పించడం కోసం బతుకుతున్నారు. ఒకానొక దశలో మనం ఎదుటివారి కోసం నిలబడటంలో ఎంతగా అలవాటుపడిపోతామంటే, మన కోసం మనం ఉండటం ఎప్పుడో మానేశామన్న సంగతి కూడా గమనించలేం. కుటుంబం ఏం ఆశిస్తుందో మీకు స్పష్టంగా తెలుసు. స్నేహితులకు ఏది అవసరమో తెలుసు. ఎక్కడ సర్దుకుపోవాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అన్న విషయాలు కూడా బాగా అలవాటవుతాయి.
బయట ప్రపంచానికి అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఈ సర్దుబాట్ల వెనుక, లోలోపల ఒక నిశ్శబ్దమైన ప్రశ్న మెదులుతుంది: “అసలు నిజంగా నాకు ఏం కావాలి?”. తమను తాము కోల్పోవడం అనేది ఏదో ఒక పెద్ద నిర్ణయంతో జరగదు. ఇతరుల కోసం ప్రతిరోజూ తీసుకునే చిన్న చిన్న రాజీలతో నిశ్శబ్దంగా మొదలవుతుంది. ఇతరుల కోసం మిమ్మల్ని మీరు కోల్పోతున్నారని తెలిపే ఐదు సంకేతాలేంటో ఇప్పుడు చుద్దాం.


