పుట్టుమచ్చ కనిపిస్తే దాన్ని ఎలా తొలగించుకోవాలా అని ఆలోచించే వారు చాలామందే ఉంటారు. ముఖ్యంగా ముఖంపై లేదా చేతులు, మెడ వంటి కనిపించే ప్రాంతాల్లో ఉన్న పుట్టుమచ్చల విషయంలో కొందరు ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తుంటారు. సోషల్ మీడియాలో ఆపిల్ సైడర్ వెనిగర్‌ను పుట్టుమచ్చపై రాస్తే అది ఎండిపోయి చివరికి ఊడిపోతుందనే చిట్కా కూడా బాగా ప్రచారంలో ఉంది. ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చని అనిపించినా, ఈ పద్ధతి వల్ల పుట్టుమచ్చ కంటే చర్మానికే ఎక్కువ నష్టం కలగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
వెనిగర్‌లోని యాసిడ్ చర్మాన్ని కాల్చడం, మంట, ఎర్రబడటం, పొక్కులు, మచ్చలు వంటి సమస్యలకు కారణం కావచ్చు. అంతేకాదు, పుట్టుమచ్చలో ఏదైనా మార్పు ఉంటే దాన్ని ఇంట్లోనే తొలగించే ప్రయత్నం చేయడం వల్ల అసలు సమస్యను గుర్తించడంలో ఆలస్యం కావచ్చు. మరి ఆపిల్ సైడర్ వెనిగర్‌తో పుట్టుమచ్చలను తొలగించడం ఎందుకు ప్రమాదకరం? సురక్షితంగా పుట్టుమచ్చలు పోవాలంటే ఏం చేయాలి? వంటి విషయాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..


