తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ కొత్త విధానాన్ని అమలు చేయనుంది. 2026–27 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పది బ్యాగ్ లెస్ డేస్ నిర్వహించనున్నారు. ఆ రోజుల్లో విద్యార్థులు పుస్తకాల బ్యాగులు లేకుండా పాఠశాలకు హాజరై సైన్స్ ప్రయోగాలు, క్విజ్లు, క్షేత్ర పర్యటనలు, చిత్రలేఖనం, నాటికలు, బాలసభలు వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎస్సీఈఆర్టీ రూపొందించిన మాడ్యూల్స్ ఆధారంగా ఈ కార్యక్రమాలు సాగుతాయి. పిల్లల్లో సృజనాత్మకత, ఆచరణాత్మక ఆలోచన, నాయకత్వ లక్షణాలను పెంచడమే లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు.


