పరిటాల శ్రీరామ్ కు రాఖీ కట్టిన తెలుగు మహిళలు
అక్కా, చెల్లెమ్మల ఆప్యాయతను మర్చిపోలేనన్న శ్రీరామ్
ధర్మవరం నియోజకవర్గ అక్క, చెల్లెమ్మల ప్రేమ, ఆప్యాయతలను ఎప్పటికీ మర్చిపోలేనని తెలుగుదేసం పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం టీడీపీ కార్యాలయంలో రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. పరిటాల శ్రీరామ్ కు తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు, పట్టణానికి చెందిన పలు వర్గాల మహిళలు రాఖీలు కట్టారు. మహిళలు పెద్ద ఎత్తున తరలి రావడంతో కార్యాలయంలో సందడి వాతావరణం కనిపించింది. శ్రీరామ్ ప్రతి ఒక్కర్నీ ఆప్యాయంగా పలుకరిస్తూ… తనకన్న చిన్న వయసు ఉన్న వారిని ఆశీర్వదించారు. తనకన్న పెద్ద వయసు ఉన్న వారు శ్రీరామ్ ను ఆశీర్వదించారు. ధర్మవరం నియోజకవర్గంలో ప్రతి అక్క, చెల్లెళ్లకు రక్షా బంధన్ సందర్భంగా శ్రీరామ్ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్న చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పండుగ వేళ ఇంత మంది మహిళల ప్రేమను చూడటం ఆనందంగా ఉందన్నారు. ధర్మవరం పట్టణంలో మహిళలకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని శ్రీరామ్ తెలిపారు.


