తుంపర్తి రోడ్డుపై యథేచ్ఛగా వ్యభిచారం, గంజాయి, మట్కా జూదం..
ధర్మవరం రూరల్ : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం రూరల్ మండలం పరిధిలోని తుంపర్తి రోడ్డు పరిసర ప్రాంతాల్లో గత రెండు సంవత్సరాలుగా అసాంఘిక కార్యకలాపాలు విపరీతంగా పెరిగిపోయాయని స్థానిక కాలనీ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుంపర్తి రోడ్డు నందు వెలసిన వ్యభిచార గృహాలు, మరియు యథేచ్ఛగా సాగుతున్న పేకాట, గంజాయి, మట్కా జూదం వల్ల స్థానికంగా శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ సుమారు ఆరుగురు మహిళలతో బహిరంగంగానే వ్యభిచార గృహాలు నిర్వహిస్తూ, వేలాది రూపాయలు దోచుకుంటున్నారని స్థానికులు పేర్కొన్నారు.ఈ అసాంఘిక శక్తుల ప్రభావం కాలనీలోని చిన్నపిల్లలు మరియు వివాహం కాని యువకులపై పడుతోందని, వారిని చూసి స్థానిక యువత కూడా చెడు మార్గాల వైపు మళ్లుతున్నారని కాలనీ పెద్దలు వాపోతున్నారు. ఈ విషయమై సంబంధిత శాఖల అధికారులకు, పోలీస్ వారికి మరియు స్థానిక కాలనీ ప్రజలకు అనేక పర్యాయాలు విన్నవించినప్పటికీ, ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు చెప్తే… నిందితులకు సమాచారం అందించి ముందే క్లోజర్ చేయిస్తున్నారని, దీనివల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు మరియు పోలీస్ యంత్రాంగం తక్షణమే స్పందించి, తుంపర్తి రోడ్డుపై సాగుతున్న ఈ జూదం, వ్యభిచార ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, కాలనీలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా జీవించేలా న్యాయం చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


