తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రం షాకిచ్చింది. రేవంత్ అమెరికా పర్యటనకి అనుమతులు నిరాకరిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.ఈనెల 20 నుంచి 29 వరకు బ్రిటన్, అమెరికా దేశాల్లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ సీఎంఓ కేంద్రానికి లేఖ రాసింది. అయితే కేంద్ర విదేశాంగ శాఖ లండన్ పర్యటనకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో సీఎం రేవంత్ లండన్ చేరుకున్నారు. ఆదివారం లండన్ నుంచి అమెరికాలోని బోస్టన్ వెళ్లాల్సి ఉండగా.. చివరి నిమిషం వరకు కేంద్రం నుంచి అనుమతులు రాకపోగా, తాజాగా పర్యటనకు నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో రేవంత్ అమెరికా పర్యటన రద్దైంది. లండన్ షెడ్యూల్ ముగించుకుని ఈ నెల 23న ఆయన హైదరాబాద్ తిరిగి రానున్నారు.


