నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు తెల్లవారుజామున 3.30 గంటలకు విగ్రహాన్ని తొలగించడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అనుమతులు లేకుండా, ప్రభుత్వ అసైన్డ్ భూమిలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే నర్సంపేటకు వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నర్సంపేటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మెల్సీ మధుసూదనాచారి నేతృత్వంలో నేతలు నర్సంపేటకు బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం ఎమ్మెల్సీ మధుసూదనాచారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నర్సంపేటలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్, డాక్టర్ రాజయ్య వంటి నేతలను హౌస్ అరెస్ట్ చేసినట్లు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్‌రెడ్డి నివాసం వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించినట్లు తెలుస్తోంది.


