
హైదరాబాద్:
ఒక్క వేలిముద్ర చాలు… లాక్ చేసిన ఫోన్ తెరవొచ్చు. ఇంటికి వేసిన తాళం తీయొచ్చు… బ్యాంకు ఖాతాలోకి చొరబడి నిలువు దోపిడీ చేసెయొచ్చు. అందుకే ఇప్పుడు సైబర్ నేరగాళ్ల కొత్త లక్ష్యం వేలిముద్రలు. అవి దొంగలపాలు కాకుండా అప్రమత్తం కావాలని చెబుతున్నారు నిపుణులు.కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం సేవలను సులభతరం చేసే ఉద్దేశంతో కొత్తకొత్త ఆవిష్కరణలకు తెర తీస్తోంది. దీనిలో భాగంగా వచ్చిందే బయోమెట్రిక్ విధానం. ప్రపంచంలో ఏ ఒక్కరి వేలిముద్రలు మరొకరితో సరిపోవు కాబట్టి మొదట్లో ఈ పరిజ్ఞానాన్ని నేరగాళ్లను పట్టుకునేందుకు వాడేవారు. ఆ తర్వాత ఇదే పరిజ్ఞానాన్ని అనేక రంగాలకు విస్తరించారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు పెరిగాక, ఆయా యాప్‌ల లాకింగ్ కోసం, ఏటీఎంలలో కూడా వేలిముద్రలు వాడడం మొదలుపెట్టారు. దీంతో సైబర్ నేరగాళ్ల చూపు ఇప్పుడు వీటిపై పడింది.ఎలా కొట్టేస్తున్నారు?ఫోన్లో రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (ర్యాట్)ని చొప్పిస్తున్నారు. నేరగాళ్లు ఏదైనా మెసేజ్ పంపుతారు. దీన్ని తెరవగానే ఫోన్లోకి ర్యాట్ వచ్చేస్తుంది. అప్పటి నుంచి ఫోన్లో జరిగే ప్రతి లావాదేవీ నేరగాళ్లకు చేరిపోతుంది. ఫింగర్ ప్రింట్ కూడా డేటా రూపంలో ఫోన్లో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన డేటా కూడా నేరగాళ్లకు చేరిపోతుంది.ఇప్పుడు ఫొటోలు దిగడం, వీడియోలు తీసుకోవడం మామూలైంది. ఈ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాలలో పెడుతుంటారు. ఇప్పుడు ఫోన్లలో వాడుతున్న కెమెరాలన్నీ హైరిజల్యూషన్ కాబట్టి చిత్రాలు చాలా స్పష్టంగా వస్తున్నాయి. వాటిలో అర చేతులు, చేతి వేళ్లు కనిపిస్తే నేరగాళ్లకు పండగే. వాటి నుంచి వేళ్లు, వాటిపై ఉన్న వేలిముద్రలను సేకరిస్తున్నారు. ఏఐ ఉపయోగించి మరింత స్పష్టంగా తయారు చేస్తున్నారు.ఎలా ఉపయోగిస్తారు?కొన్ని బ్యాంకులు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం పేరుతో ఖాతాదారులకు వేలిముద్రల ద్వారా ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. ఇటీవల పెద్ద సంఖ్యలో తమ ఖాతాదారుల వివరాలు సైబర్ నేరగాళ్లు కొట్టేశారని ఎస్బీఐ స్వయంగా ప్రకటించింది. అలానే వాహన బీమా వ్యాపారంలో ఉన్న మరో సంస్థ నుంచి కూడా 4 కోట్ల మందికి పైగా ఖాతాదారుల వివరాలు కొట్టేశారు.ఇలా కొట్టేసిన వివరాల్లో బ్యాంకు ఖాతా నంబరే కాదు ఆధార్ వంటి వివరాలన్నీ ఉంటాయి. ఇవి చోరీ చేసిన ముఠాలకు వేలిముద్రలు కూడా దొరికితే ఇక పండగే. కొట్టేసిన వేలిముద్రను ఉపయోగించి భౌతికంగా సిలికాన్ వేలిముద్రలు తయారు చేస్తారు. వీటిని ఉపయోగించి ఏటీఎంలలో డబ్బు డ్రా చేయవచ్చు.దస్తావేజుల ద్వారా వేలిముద్రలు చోరీ చేసి డబ్బు డ్రా చేసుకుంటున్న ఉదంతానికి సంబంధించి గతంలో తెలంగాణ సీఐడీ పోలీసులు బిహార్‌కు చెందిన రంజిత్‌షా, పశ్చిమబెంగాల్‌కు చెందిన సఫత్ అలం అనే నిందితులను అరెస్టు చేశారు.జీహెచ్ఎంసీలో తొలగించిన, మరణించిన స్వీపర్ల వేలిముద్రలు నకిలీవి తయారు చేసి, వారు విధుల్లో ఉన్నట్లు ఈ నకిలీ వేలిముద్రల ద్వారా హాజరు వేసుకొని, వారికి రావాల్సిన వేతనాలు కొల్లగొట్టిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు.ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?ఫోన్లు, బ్యాంకు యాప్‌ల వంటివాటికి వేలిముద్రలు కాకుండా పిన్ నంబర్లు పెట్టుకోవడం, వాటిని తరచూ మార్చుకోవడం ఉత్తమం. తెలియని వారి నుంచి వచ్చిన సందేశాలు తెరవొద్దు. నాసిరకమైన యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవద్దు. వేలిముద్రలు కనిపించేలా చేతుల ఫొటోలు సామాజిక మాధ్యమాలలో పెట్టొద్దు.


