అమరావతి: మురసు తుఫాన్ పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెల్లవారుజామున 03:30 గంటలకు జిల్లా కలెక్టర్లు, అధికారులతో మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.మురసు తుఫాన్ 01 గంటకు తీరాన్ని తాకిందని, ఉదయం 06:30 గంటలకు పూర్తిగా తీరాన్ని దాటుతుందని అధికారులు సీఎంకు తెలిపారు. ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తుఫాన్ తీరాన్ని తాకినట్లు వెల్లడించారు.తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జనం రోడ్లపైకి రాకుండా చూడాలని, ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆస్తి నష్టాన్ని కూడా వీలైనంత మేరకు నివారించాలని సీఎం సూచించారు. విద్యుత్ స్తంభాలు, సబ్ స్టేషన్ల పరిస్థితిపై ఆరా తీయగా, ఎక్కడా స్తంభాలు పడిపోలేదని, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు
జిల్లా కలెక్టర్ల నివేదికలు:బాపట్ల: భారీ వర్షాలు, కొన్నిచోట్ల చెట్లు కూలగా తొలగించామని, రేపల్లె, చీరాల, వేటపాలెం లో వర్షం ఎక్కువగా ఉందని కలెక్టర్ తెలిపారు.నెల్లూరు: 7 చోట్ల చెట్లు కూలాయని, వెంటనే తొలగించామని, ప్రస్తుతం మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.ప్రకాశం (ఒంగోలు): 5 ప్రాంతాల్లో చెట్లు పడిపోగా చర్యలు చేపట్టామని కలెక్టర్ రాజాబాబు తెలిపారు.కృష్ణా: అవనిగడ్డ, నాగాయలంక ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా ఉందని కలెక్టర్ తెలిపారు.గుంటూరు: అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైందని, ఎక్కడా విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలలేదని కలెక్టర్ తెలిపారు.ఎన్టీఆర్ జిల్లా: వివిధ ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయని, బుడమేరు పరిధిలో పర్యటించామని, ప్రస్తుతానికి ఇబ్బంది లేదని, మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడే ముందు జాగ్రత్తగా కొన్ని కుటుంబాలను శిబిరాలకు తరలించామని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు.తుఫాన్ సహాయక చర్యలు తీసుకుంటూనే స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ కు చర్యలు తీసుకున్నామని కలెక్టర్లు తెలిపారు.గత రాత్రి 10 గంటలకు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేసిన సీఎం, రాత్రి నుంచి ప్రతి గంటకు అధికారుల నుంచి సమాచారం తీసుకుంటున్నారు. సోమవారం నాడు ఆర్టీజీఎస్ లోనే ఉండి మూడు టెలికాన్ఫరెన్స్ లు నిర్వహించి సమీక్షించారు.