మంత్రి ఇలాకాలోనే నిబంధనలు గాలికి.. ఎస్పీ ఆదేశాలు బుట్టదాఖలు.. పోలీసుల నిర్లక్ష్యంపై ప్రజాగ్రహం
ధర్మవరం పట్టణంలో వినాయక నిమజ్జనం తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం శివనగర్ బ్రహ్మంగారి గుడి పరిధిలోని శారదా నగర్ నుంచి కదిరి గేట్ వైపు జరుగుతున్న ఊరేగింపులో అదుపుతప్పిన ట్రాక్టర్ చిన్నారులపై దూసుకెళ్లడంతో 9 ఏళ్ల చిన్నారి వర్షిత అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారంతా ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అసలేం జరిగింది
ప్రత్యక్ష సాక్షులు, స్థానికుల కథనం ప్రకారం.. విగ్రహాన్ని తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ ఒక్కసారిగా ముందు చక్రాలను గాలిలోకి లేపి విన్యాసం చేయబోయాడు. అదే సమయంలో DJ సౌండ్ కు ముందు భాగంలో డ్యాన్స్ చేస్తున్న చిన్నారులపైకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. చిన్నారి వర్షిత తలపై నుంచి ట్రాక్టర్ చక్రం వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయింది.తెర వెనుక ఉన్న వైఫల్యం ఇదే..
1. తాగి తూలిన డ్రైవర్లు, మార్మోగిన DJ సౌండ్: నిమజ్జనం పేరుతో కొందరు ట్రాక్టర్ డ్రైవర్లు, కమిటీ సభ్యులు మద్యం సేవించి తూలుతూ వాహనాలు నడిపారని, 55 డెసిబుల్స్ కు మించకూడని DJ సౌండ్ ను 150 డెసిబుల్స్ కు పైగా పెట్టి నిబంధనలు ఉల్లంఘించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
2. ఎస్పీ ఆదేశాలు పక్కా.. అమలు మాత్రం శూన్యం: జిల్లా ఎస్పీ గారు నిమజ్జనాల వేళ DJ సౌండ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పై పక్కా ఆదేశాలు ఇచ్చినా, టూ టౌన్ పోలీసుల స్థాయిలో అమలు పూర్తిగా విఫలమైంది. ఘటనా స్థలంలో ముందస్తు బందోబస్తు లేదు, బారికేడ్లు లేవు, బ్రీత్ ఎనలైజర్ తనిఖీలు లేవు. ప్రమాదం జరిగిన తర్వాత మాత్రమే పోలీసులు వచ్చి కేసు నమోదు చేశారు.మంత్రి ఇలాకాలోనే అపశృతి.. మంత్రి సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి ఘటన జరగడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఘటన అనంతరం మంత్రి నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్ ద్వారా బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.అయితే ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే.. ప్రాణం పోయిన తర్వాత పరామర్శలు కాదు, ప్రాణం పోకుండా ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదు?ప్రజల డిమాండ్:మద్యం సేవించి నడిపిన డ్రైవర్ పై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలి.నిబంధనలు ఉల్లంఘించిన DJ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి.నిర్లక్ష్యం వహించిన పోలీసు సిబ్బందిపై విచారణ జరపాలి.చిన్నారి వర్షిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించాలి..


