తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య పథకంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఒకసారి వైద్య ఖర్చుకు ఉన్న రూ.2 లక్షల పరిమితిని రూ.3 లక్షలకు పెంచింది. రూ.3 లక్షలు దాటిన చికిత్సలకు రూ.10 లక్షల వరకు సబ్‌కమిటీ, అంతకుమించిన వాటికి ట్రస్టు బోర్డు అనుమతి అవసరం. ఖర్చు ఎంతైనా చికిత్సను తిరస్కరించరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. CGHS ప్యాకేజీ ధరలను వర్తింపజేయనున్నారు. కొత్తగా 25 వెల్నెస్ కేంద్రాలు ఏర్పాటు చేసి 33 జిల్లాల్లో సేవలను విస్తరించనున్నారు. ఆసుపత్రుల అదనపు వసూళ్లపై కూడా కఠిన నిబంధనలు విధించారు.


