
నంద్యాల జిల్లా: నవంబర్ 23
కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా నంద్యాల జిల్లా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావించే కార్తీక సోమవారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీశైలం తరలివచ్చారు. దీంతో శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.
స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉండటంతో ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. కార్తీక సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి మల్లన్న దర్శనానికి తరలివస్తున్నారు. అమ్మవార్ల దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతుంది.
నిన్న ఆదివారం స్వామి, అమ్మవార్లను 43,247 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు కూడా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.


