
అమరావతి:
ఆంధ్రప్రదేశ్ లో అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ హక్కుల మంజూరు దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.అసైన్డ్ భూములు, చుక్కల భూములు, గ్రామాల్లో ఇనాం భూములు, పట్టా భూములకు ఫ్రీహోల్డ్ హక్కుల మంజూరు ప్రక్రియలో దరఖాస్తుల పరిష్కారానికి నిర్దిష్ట గడువులు విధించింది.దరఖాస్తులు అందిన రోజే ఆన్ లైన్ లో సంబంధిత తహసీల్దార్ కు పంపాలని, తహసీల్దార్ వాటిని 60 రోజుల్లోగా పరిష్కరించాలని, లేదా తహసీల్దార్ నివేదిక అందిన వెంటనే 60 రోజుల గడువు ముగిసేలోపు ఆర్డీవో లాగిన్ కు పంపాలని సూచించింది. ఆర్డీవో లాగిన్ కు చేరిన తర్వాత 30 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించింది.2023 నాటి భూ హక్కుల సవరణ చట్టం ప్రకారం ఓ భూమికి ఫ్రీహోల్డ్ హోదా కల్పించి వెబ్ ల్యాండ్ లో నమోదు చేస్తే రిజిస్ట్రేషన్ కు అనుమతించాలని, ఇందుకు రిజిస్ట్రేషన్ శాఖలోని PDE మాడ్యూల్ వాడాలని సూచించింది. దీన్ని సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు ప్రత్యేక ఉత్తర్వుల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని తెలిపింది.అలాగే ఫ్రీహోల్డ్ ఉత్తర్వులను రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించాల్సిన అవసరం లేదని, వెబ్ ల్యాండ్ లో ఉన్న స్థితి ఆధారంగానే రిజిస్ట్రేషన్ కొనసాగాలని, రిజిస్ట్రేషన్ అధికారులు వెబ్ ల్యాండ్ API ద్వారా పొందిన భూమి స్థితిని రికార్డుల్లో భద్రపరచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వెబ్ ల్యాండ్ లో అవసరమైన మార్పులు చేయాలని ఆదేశించింది. జాప్యం తగ్గించడం, ఆన్ లైన్ ప్రక్రియ వేగవంతం చేయడం, రిజిస్ట్రేషన్లలో సమస్యలు తొలగించడమే లక్ష్యంగా ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది.


