తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామానికి చెందిన 18 ఏళ్ల శశిభవ్యత ‘లాఫోరా మయోక్లోనిక్ ఎపిలెప్సీ’ అనే అరుదైన జన్యులోప వ్యాధితో బాధపడుతోంది. మతిస్థిమితం సరిగా లేక పూర్తిగా మంచానికే పరిమితమైన ఆమె.. టాలీవుడ్ హీరో రామ్ పోతినేని పేరు వింటే ఎంతగానో ఉత్సాహం చూపుతుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న హీరో రామ్ వెంటనే స్పందించి, బుధవారం ఆమెతో స్వయంగా వీడియో కాల్లో మాట్లాడారు. శశిభవ్యత చికిత్సకు అవసరమయ్యే మందులు, వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానని మాటిచ్చి ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచారు.


