హైదరాబాద్‌లో గ్రీన్ వాటర్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని జలమండలి భావిస్తోంది. ఇందులో భాగంగా కోకాపేటలో గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. నీటి నాణ్యత పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించడం.. ఫలితాలను ఆన్లైన్లో నమోదు చేయడం.. హెడ్ క్వార్టర్స్ నుంచి ప్రత్యక్ష పర్యవేక్షణకు వీలు కల్పించడం వంటి చర్యలకు అధికారులు ఆదేశించారు. ట్యాంకర్ల సామర్థ్యానికి అనుగుణంగా నీటిని నింపడం, అదనపు నీటిని వృథా కాకుండా చెరువులకు మళ్లించడం వంటి ఏర్పాట్లు చేయనున్నారు. నిర్మాణాలు, పరిశ్రమలు, రోడ్ల శుభ్రత, దుమ్ము నియంత్రణ, పార్కుల నిర్వహణకు గ్రీన్ వాటర్‌ను వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


