ప్రవాహాలతో రిజర్వాయర్లు, చెరువులు నింపాలని సీఎం చంద్రబాబు అన్నారు. పడుతున్న వర్షాలతో భూగర్భజలాల రీఛార్జ్ అవుతాయని పేర్కొన్నారు.
వర్షాల కారణంగా వస్తున్న ప్రవాహాలతో రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్ని నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కృష్ణా, గోదావరి డెల్టాలోని రిజర్వాయర్లతో పాటు పరిధిలో ఉన్న వివిధ నీటి వనరుల్ని కూడా నింపాలని స్పష్టం చేశారు. రియల్‌టైమ్ గవర్నెన్స్ కేంద్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగం, డేటా అనలిటిక్స్, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే వ్యూహాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్ష ప్రభావంపై సీఎం చర్చించారు.
తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్రంలో గడచిన మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భూగర్భజలాలు కొంత మేర పెరిగాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రకాశం బ్యారేజి సహా మున్నేరు సహా ఇతర క్యాచ్ మెంట్ ఏరియా నుంచి 11 వేల క్యూసెక్కుల నీరు వస్తోందని అన్నారు. ప్రాజెక్టుల దిగువన ఉన్న అన్ని నీటి వనరుల్లో వర్షపు నీటిని నిల్వ చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. అవసరమైన చోట మోటార్లను వాడి నీటిని లిఫ్ట్ చేయాలని స్పష్టం చేశారు. గోదావరి నుంచి వస్తున్న ప్రవాహాల ద్వారా 24 టీఎంసీల నీటిని ఏలేరు రిజర్వాయర్ నింపాలని స్పష్టం చేశారు.
పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకూ నీటి వనరుల్లోకి నీటిని పంపాలన్నారు చంద్రబాబు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వర్షాలు అధికంగా నమోదు అయ్యాయని అధికారులు వివరించారు. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ సహా వివిధ జిల్లాల్లో తీవ్ర వర్ష ప్రభావం కనిపించిందని తెలిపారు.
ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాలు, గాలుల తీవ్రత, నదులు-వాగుల్లో పెరుగుతున్న ప్రవాహాలు, రిజర్వాయర్లలోకి చేరుతున్న వరద నీరు, రాబోయే రోజుల్లో అంచనా వేసిన వర్షపాతంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. తాజా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టేలా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల ప్రభావంతో గోదావరి బేసిన్‌లోని శబరి, ఇంద్రావతి, ఏలేరు, తాండవ, ఎర్రకాల్వ, పంపా, మేఘాద్రిగడ్డ తదితర రిజర్వాయర్లకు భారీగా వరద నీరు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.


