
తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించకపోవడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ వ్యవహారం విజయ్ సర్కార్ మెడకు చుట్టుకుంది. ఏకంగా ప్రభుత్వాన్ని రద్దు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పై హిందూ వ్యతిరేకి అనే ముద్రపడుతోంది.
తాజాగా కార్తీక దీపం వివాదంతో TVK (తమిళగ వెట్రి కజగం) ప్రభుత్వానికీ ఇలాంటి పేరే వస్తోంది. స్వయంగా సుప్రీంకోర్టు ఆదేశించినా అనాదిగా కొనసాగుతున్న కార్తీక పౌర్ణమి ఆచారాన్ని అవమానించేలా విజయ్ సర్కార్ వ్యవహరించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నవంబర్ 24, మంగళవారం కార్తీక పౌర్ణమి రోజున మధురైలోని తిరుప్పరంకుండ్రం కొండపైని దీపత్తూన్ పై కార్తీక దీపం వెలిగించకపోవడం రాజకీయ చర్చకు దారితీసింది. TVK ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
సుప్రీంకోర్టు తిరుప్పరంకుండ్రంలో ఈ ఒక్కసారికి కార్తీక దీపం వెలిగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే దీన్ని తమిళనాడు ప్రభుత్వం అమలుచేయలేదు. దీంతో కోర్టు ధిక్కరణకు పాల్పడిన TVK ప్రభుత్వాన్ని రద్దు చేయాలని హిందూ సంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆర్టికల్ 356 ఉపయోగించి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని, తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని కొందరు కోరుతున్నారు.అయితే రాష్ట్రపతి పాలన విధించడం అంత తేలికైన విషయం కాదని, చిన్న విషయాలను పరిగణలోకి తీసుకుని ఇంత పెద్ద నిర్ణయం తీసుకోలేరని TVK నాయకులు అభిప్రాయపడుతున్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ కార్తీక దీపం వివాదానికి తెరదించే ప్రయత్నం చేస్తున్నారు.మధురై సమీపంలోని సికిందర్ బాదుషా దర్గా దగ్గర తిరుప్పరంకుండ్రం కొండపై ఓ ఆలయం కూడా ఉంది. ఇక్కడి పురాతన రాతి స్తంభమైన దీపత్తూన్ పై ప్రతి ఏటా కార్తీక దీపం వెలిగిస్తారు. దర్గాకు ఈ ప్రాంతం దగ్గరగా ఉందని, శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయనే కారణాలతో స్థానిక అధికారులు నవంబర్ 2025లో కొండపైన దీపం వెలిగించడానికి అనుమతి నిరాకరించడంతో వివాదం మొదలైంది.
డిసెంబర్ 2025లో మద్రాస్ హైకోర్టు దీపత్తూన్ వద్ద దీపం వెలిగించాలని ఆదేశించింది. జనవరి 6, 2026న డివిజన్ బెంచ్ కూడా ఈ ఆదేశాన్ని సమర్థించింది. హైకోర్టు నిర్ణయాలను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నవంబర్ 20న సుప్రీంకోర్టు ధర్మాసనం షరతులతో కూడిన అనుమతితో నవంబర్ 24న ఒక్కసారి మాత్రమే దీపం వెలిగించేందుకు అనుమతించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలపై తక్షణ స్టే కోరుతూ తమిళనాడు ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.అయినప్పటికీ నిన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించలేదు. దీంతో విజయ్ ప్రభుత్వంపై హిందూ సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. TVK ప్రభుత్వాన్ని గద్దె దించాలనే డిమాండ్ కూడా మొదలయ్యింది.


