ఈ రోజుల్లో చాలా మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. పురుషులు, మహిళలు ఇద్దరికీ గుండె జబ్బుల ముప్పు ఉంది. సాధారణంగా మహిళల్లో గుండె జబ్బులు మెనోపాజ్ (రుతుక్రమం ఆగిపోవడం) తర్వాతే వస్తాయని చాలామంది భావిస్తుంటారు. అయితే, ఈ మార్పులు మహిళల 30ల చివర్లోనే (Late 30s) ప్రారంభమవుతున్నట్లు తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ‘ఫ్రామింగ్హామ్ హార్ట్ స్టడీ’ (Framingham Heart Study) లోని 9,500 మందికి పైగా (6,500 మందికి పైగా మహిళలు, 3,000 మంది పురుషులు) డేటాను 14 ఏళ్లపాటు విశ్లేషించి రూపొందించిన ఈ నివేదిక హైపర్టెన్షన్ జర్నల్లో ప్రచురితమైంది. వయసు పెరిగే కొద్దీ ‘పల్స్ ప్రెజర్’ ఎలా మారుతుందనే విషయాన్ని ఇందులో పరిశీలించారు. మహిళల్లో పల్స్ ప్రెజర్ 37–39 ఏళ్ల వయస్సు నుంచే పెరగడం మొదలవుతుందని అధ్యయనంలో వెల్లడైంది. అంటే మహిళలకు గుండె జబ్బుల ముప్పు మగవారి కన్నా 10 ఏళ్ల ముందు నుంచే ప్రారంభమవుతుంది.


