
భద్రాద్రి కొత్తగూడెం:
చిల్లర ఇవ్వలేదన్న కారణంతో మహిళా కండక్టర్ ను బస్సు నుంచి కిందకు నెట్టివేయగా, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద కొడుకుతో కలిసి భద్రాచలం వెళ్లే బస్సు ఎక్కిన అశ్వాపురం మండలం మిట్టగూడెంకు చెందిన మౌనిక అనే మహిళ కొడుకుకు టికెట్ ఇవ్వమని రూ. 100 ఇవ్వగా, కండక్టర్ ప్రవళిక రూ. 10 టికెట్ జారీ చేసి, మిగతా చిల్లరను టికెట్ వెనుక రాసింది.తనకు చిల్లర ఇప్పుడే కావాలని కండక్టర్ తో వాగ్వాదానికి దిగిన మౌనిక ఆమెను బస్సు నుంచి కిందకు నెట్టివేసింది. దీంతో బస్సు వెనుక టైర్ల కింద పడి ప్రవళిక రెండు కాళ్లు విరిగాయి. తీవ్రంగా గాయపడిన ప్రవళిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికురాలి నిర్వాకం పట్ల ఆర్టీసీ ఉద్యోగులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


