
హైదరాబాద్:
ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద కండక్టర్ ప్రవళిక పార్థివదేహానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు.ప్రవళిక తల్లిని పరామర్శించి టీఎస్ఆర్టీసీ కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రవళిక తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వం, ఆర్టీసీ నుండి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా బ్యాంకు నుండి కోటి రూపాయల ప్రమాద బీమా అందుతుందని వివరించారు.ఇటీవల ప్రయాణికులతో జరిగిన వివాదంలో ప్రవళిక బస్సు టైర్ల కింద పడి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని సాయి సంజీవని ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించామని, ఆరోగ్యం మెరుగుపడి త్వరగా కోలుకొని తిరిగి విధుల్లో చేరుతారని ఆశించానని, మృతి చెందడం అత్యంత బాధాకరమని సంతాపం తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


