
పోలీసు విధుల్లో మానవత్వానికి ప్రాధాన్యం ఎంత ముఖ్యమో చైతన్యపురి మహిళా కోర్టు కానిస్టేబుల్ దీప చేసిన పనితో సమాజానికి చాటిచెప్పారు. రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టులో విచారణకు హాజరైన ఓ బాధితురాలు తన చంటి బిడ్డతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించిన ఆ మహిళా కానిస్టేబుల్.. ఆ చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని విచారణ పూర్తయ్యే వరకు లాలించారు. బిడ్డను లాలిస్తూ, ఆడిస్తూ తల్లిలా ఆలనాపాలనా బాధ్యత తీసుకున్నారు. బాధితురాలికి కొంత ఊరట కల్పించడంతో పాటు.. పోలీసులంటే కేవలం చట్టాన్ని అమలు చేసేవారే కాదని.. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచే మానవతావాదులని నిరూపించారు.


